జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ..ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 లక్ష్యానికి మరింత చేరువైంది. చంద్రయాన్ -3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం జాబిల్లి చుట్టూ 150 కిలోమీటర్లు బై 177 కిలోమీటర్ల కక్ష్యలో చంద్రయాన్ -3 పరిభ్రమిస్తోంది. చంద్రుడి చుట్టు చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్ -3కి ఇది రెండో చివరి కక్ష్య. ఈ నెల 5వ తేదీన చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ -3 ప్రవేశించింది. ఆ తర్వాత 6, 9 తేదీల్లో కక్ష్య తగ్గింపు విన్యాసాలను ఇస్రో చేపట్టింది. ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మరోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. ఆ రోజు చంద్రునికి 100 కిలోమీటర్ల దూరంలోకి కక్ష్యలోకి చంద్రయాన్ -3 చేరనుంది. ఆ తర్వాత రోవర్ , ల్యాండర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ... ప్రొపల్షన్ మాడ్యూల్ తో విడిపోనుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23వ తేదీ సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. అందులోంచి రోవర్ బయటకు వచ్చి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది.
0 కామెంట్‌లు