అయాచితం నటేశ్వర శర్మ
కవి, రచయిత అయాచితం నటేశ్వర శర్మను దాశరథి కృష్ణమాచార్య అవార్డు వరించింది. ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.
దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా, ఆయన పేరుతో ప్రతి ఏటా ప్రకటించే 'శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును' 2023 సంవత్సరానికి ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని, కామారెడ్డి జిల్లాకు చెందిన అయాచితం నటేశ్వర శర్మకు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ అవార్డుతో పాటు 1,01,116 రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికను... రవీంద్ర భారతిలో జరిగే శ్రీ కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డు గ్రహీతకు అందజేస్తారు. ఈ సందర్భంగా అయాచితం నటేశ్వర శర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో దాశరథి 98వ జయంతి సందర్భంగా ప్రముఖ కవి వేణు సంకోజుకు ఈ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.
అవార్డు ప్రదానం
సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా దాశరథి జయంతి(జులై 22) రోజున ఆ అవార్డును ప్రదానం చేస్తుంది. 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రదానం చేస్తుంది. తెలుగు సాహిత్యంలో విశిష్ఠ స్థానం పొందిన దాశరథి కృష్ణమాచార్య 1925 జులై 22న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయన పేరుపై తెలంగాణ ప్రభుత్వం అవార్డు ప్రదానం చేస్తుంది. సాహిత్య రంగంలో విశేష సేవ చేసిన రచయితలు, కవులకు ఈ పురష్కారం అందిస్తోంది. 2015లో మొదటిగా దాశరథి సాహితీ పురస్కారాన్ని కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యకు అందించారు. 2016లో జే.బాపురెడ్డికి, 2017లో ఆచార్య ఎన్.గోపికి, 2018లో వఝల శివకుమార్‌కి, 2019లో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు, 2020లో తిరునగరి రామానుజయ్యకు, 2021లో తెలుగు యూనివర్సిటీ పూర్వ వీసీ ఎల్లూరి శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు ప్రదానం చేశారు.
అయాచితం నటేశ్వరశర్మ ప్రస్థానం
అయాచితం నటేశ్వరశర్మ 1956, జులై 17న కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామంలో.. జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించారు. 1966 వరకు రామారెడ్డిలోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన... 1967లో తిరుపతిలోని వేద సంస్కృత పాఠశాలలో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య, వ్యాకరణాలను అభ్యసించారు. 1977లో శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల నుంచి వ్యాకరణ శిరోమణి పట్టా పొందారు. అనంతరం కామారెడ్డిలోని ప్రాచ్య విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా పనిచేశారు. అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు నటేశ్వర శర్మ. ఆయన సంస్కృతాంధ్ర భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. జాతీయ సాహిత్య పరిషత్తు, హితసాహితి వంటి సాహిత్యసంస్థలలో కీలక పదవులలో పనిచేశారు. ఎందరో యువకవులకు మార్గదర్శనం చేసి వారిని కవులుగా తీర్చిదిద్దారు. నటేశ్వర శర్మ సంస్కృతంలో, తెలుగులో అష్టావధానాలు, శతావధానాలు చేశారు. వసంత కుమారి, శ్రీ గజానన స్తోత్రమ్, శ్రీ షోడశీ, భారతీప్రశస్తి, ఆముక్తమాల్యద పరిశీలనం, రుతుగీతతో పాటు సుమారు 50 వరకు రచనలు చేశారు. నటేశ్వర శర్మకు కవిరత్న, అవధానిశిరోమణి, మహోపాధ్యాయ అనే బిరుదులు కలవు.
నటేశ్వర శర్మ కు దాశరథి కృష్ణమాచార్యా అవార్డు రావడం కామారెడ్డి ప్రాచ్య కళాశాల పూర్వ విద్యార్థులు వారికి అభినందనలు తెలియజేశారు.
0 కామెంట్‌లు